43 ఏళ్ల కంపెనీ అమ్మేసి.. కార్మికులకు రూ.కోట్లు పంచిన యజమాని!

  • అమెరికాలో 1.7 బిలియన్ డాలర్లకు కంపెనీ అమ్మకం
  • ఉద్యోగులకు 240 మిలియన్ డాలర్లు పంచిన యాజమాన్యం
  • సగటున ఒక్కో ఉద్యోగికి రూ. 3.75 కోట్ల లబ్ధి
  • కష్టకాలంలో అండగా నిలిచినందుకే ఈ బహుమతి అన్న యజమాని
  • డబ్బుతో సొంతింటి కల, వ్యాపారం నెరవేర్చుకుంటున్న కార్మికులు
అమెరికాలో ఓ కుటుంబం 43 ఏళ్లుగా నడిపిన తమ కంపెనీని అమ్మేసి, ఉద్యోగుల పట్ల అపూర్వమైన ఉదారతను చాటుకుంది. కంపెనీ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో భారీ వాటాను ఉద్యోగులకు పంచి, వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. ఈ ఘటన లూసియానా రాష్ట్రంలోని మైండెన్ నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, వాకర్ కుటుంబీకులు ఫైబర్‌బాండ్ కార్పొరేషన్ అనే విద్యుత్ పరికరాల తయారీ కంపెనీని నడిపేవారు. ఇటీవలే ఈ కంపెనీని పవర్ మేనేజ్‌మెంట్ దిగ్గజం 'ఈటన్'కు 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 14,500 కోట్లు) అమ్మేశారు. అయితే, అమ్మకం ఒప్పందంలో కంపెనీ సీఈఓ గ్రాహం వాకర్ ఒక కీలక షరతు పెట్టారు. అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో 15 శాతానికి సమానమైన 240 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 2000 కోట్లు) కంపెనీలోని 540 మంది పూర్తిస్థాయి ఉద్యోగులకు పంచాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయంతో సగటున ప్రతి ఉద్యోగి సుమారు 4,43,000 డాలర్లు (దాదాపు రూ. 3.75 కోట్లు) అందుకోనున్నారు. విశేషమేమిటంటే, ఈ ఉద్యోగుల్లో ఎవరికీ కంపెనీలో ఎలాంటి వాటాలు (ఈక్విటీ) లేవు. ఈ బోనస్‌ను జూన్ నుంచి ఐదేళ్ల వ్యవధిలో చెల్లిస్తారు. ఉద్యోగులు కంపెనీలో కొనసాగితేనే పూర్తి మొత్తం అందుతుంది. అయితే, 65 ఏళ్లు పైబడిన వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

1982లో ప్రారంభమైన ఈ కంపెనీ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. 1998లో ఫ్యాక్టరీ దగ్ధమవడం, డాట్-కామ్ సంక్షోభం వంటి కష్టకాలంలోనూ యాజమాన్యం అండగా నిలవడంతో ఉద్యోగులు ఎంతో విధేయత చూపారు. ఇటీవల ఏఐ, క్లౌడ్ డిమాండ్ పెరగడంతో కంపెనీ అమ్మకాలు 400 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలోనే కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతి ఇవ్వాలని వాకర్ కుటుంబం నిర్ణయించుకుంది.

బోనస్ విషయం తెలియగానే ఉద్యోగులు ఆశ్చర్యం, ఆనందంతో ఉప్పొంగిపోయారు. కొందరు ఆనందభాష్పాలు రాల్చగా, "ఇక్కడ రహస్య కెమెరాలు ఏమైనా ఉన్నాయా?" అని ఓ ఉద్యోగి నమ్మలేనట్టు అడిగాడు. ఈ డబ్బుతో కొందరు తమ ఇంటి అప్పులు తీర్చుకోగా, మరికొందరు వ్యాపారాలు ప్రారంభించేందుక రెడీ అవుతున్నారు. డిసెంబర్ 31న సీఈఓ పదవి నుంచి వైదొలిగిన గ్రాహం వాకర్, తన ఉద్యోగుల పట్ల చూపిన ఈ ఔదార్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Graham Walker
Fiberbond Corporation
Eaton
company sold
employee bonus
Louisiana
Mindenn city
power management
AI cloud demand
crorepati employees

More Telugu News